న్యూఢిల్లీ: జాతీయ పౌరుల నమోదు(ఎన్ఆర్సీ)లో లేనివారు దేశం విడిచి వెళ్లాలనే విషయంపై వివాదం రాజుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారతదేశ పౌరులెవరూ దేశం విడిచిపెట్టనక్కర్లేదన్నారు. ఎన్ఆర్సీకి సంబంధించిన ఆందోళలనపై మోదీ 'ఎన్ఐఏ' వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
పౌరుల నమోదు ప్రక్రియకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నామని, వాటిని ఉపయోగించుకోవచ్చని, ఎవరికి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించుకోవచ్చని, ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వారే 'పౌర యుద్ధం', 'రక్తతర్పణం', 'దేశ విచ్ఛిన్నం' లాంటి పదాలను వాడుతారని పరోక్షంగా మమతను విమర్శించారు. ఎన్ఆర్సీపై తమ పార్టీ వైఖరి ఎప్పటినుంచో స్పష్టంగా ఉందన్నారు. సున్నిత అంశాలతో రాజకీయాలు కాకుండా సమాజంలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
మహిళలపై చోటుచేసుకుంటున్న అత్యాచారాలు, మూకహత్యలపై ప్రధాని మాట్లాడుతూ, ఒక్క సంఘటన చోటుచేసుకున్నా అది దురదృష్టకరమేనన్నారు. ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, సమాజంలో శాంతి, ఐక్యత సాధనకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని కొట్టిపారేశారు. గత ఏడాదిలో కోటి ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. ఉద్యోగాల సృష్టి లేదనే ప్రచారాన్ని ఆపేస్తే మంచిదని మోదీ అన్నారు.