SLBC Tunnel Accident: మహబూబ్‌నగర్ జిల్లా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ సొరంగంలో కొంతభాగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగంలో చిక్కుకున్న కార్మకుల్ని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి బృందాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఇప్పుడు ర్యాట్ హోల్ మైనర్లు రంగంలో దిగుతున్నారు.
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ సొరంగంలో పనులు జరుగుతుండగా లోపల 13.93 కిలోమీటర్ల వద్ద పైభాగం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మట్టి, బురద నీరు, శిథిలాలతో టన్నెల్ మూసుకుపోయింది. మరోవైపు మోకాలి లోతు నీళ్ళు కూడా ఉన్నాయి. దాంతో కార్మికుల వరకూ చేరుకోలేకపోతున్నారు. అసలు కార్మికులు ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. టన్నెల్ లోపలి పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది. పైకప్పు ఎక్కడైనా కూలవచ్చనే ఆందోళన కూడా వెంటాడుతోంది. సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతానికి 100 మీటర్ల దూరం వరకు వెళ్లి గట్టిగా కేకలు వేస్తున్నా ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ ఘటన జరిగి అప్పుడే 48 గంటలు దాటేసింది. ఘటన జరిగిన ప్రాంతంలో రెండు వైపులా టన్నెల్ మూసి ఉండటంతో ఆక్సిజన్ లభించడం కష్టమే. అందుకే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది.
రంగంలో దిగనున్న ర్యాట్ హోల్ మైనర్లు
టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికుల్ని ఎవరూ కాపాడలేకపోవడంతో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్లు రంగంలో దిగారు. ఈ టీమ్ గతంలో అంటే 2023లో ఉత్తర కాశీ సొరంగం దుర్ఘటన జరిగినప్పుడు 27 రోజుల సుదీర్ఘ ప్రయత్నాల తరువాత ర్యాట్ హోల్ మైనర్లు ఒకే ఒక రోజులో 41 మందిని కాపాడారు. ఇప్పుడీ టీమ్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్‌కు చేరుకుంది. లోపలకు వెళితే తప్ప పరిస్థితి ఏంటో చెప్పలేమంటున్నారు.
ర్యాట్ హోల్ మైనర్ల ప్రత్యేకత
పేరుకు తగ్గట్టే ఈ టీమ్ సభ్యులు చిన్న రంధ్రాన్ని ఓ పక్క నుంచి తవ్వుకుంటూ లోపలకు వెళ్తారు. దారిలో ఎలాంటి రాళ్లు ఉన్నా రంధ్రం పెట్టుకుంటూ వెళ్లడంలో నిపుణులు. ఓ కచ్చితమైన దారిని తెలుసుకున్న తరువాత అదే రంధ్రాన్ని పెద్దది చేస్తూ అందరూ బయటకు వచ్చేలా చేస్తారు. ఇది చాలా ప్రమాదరమైంది. టీమ్ సభ్యుల ప్రాణాలకు ప్రమాదం కావడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో తప్పని పరిస్థితుల్లో అమల్లో ఉంది.
టన్నెల్ మట్టి, రాళ్లు, నీటిని పరిశీలించి లోపలకు రంధ్రం చేసుకుంటూ వెళ్లగలరా లేదా అనేది అంచనా వేస్తారు. ఉత్తరాఖండ్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక పైపుల్ని లోపలకు పంపిచి దాని ద్వారా నీరు, ఆహారం అందించారు. ఇప్పుడు అలాగే చేద్దామంటే పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. పెద్ద పెద్ద బండరాళ్లు పడి ఉండటంతో సాధ్యం కాని పరిస్థితి. అసలు కార్మికుల క్షేమ సమాచారమే తెలియడం లేదు.
Also read: Champions Trophy 2025: పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయా, ఇలా జరిగితేనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి