Pawan Kalyan Latest News Updates: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌కు క్షణం తీరిక దొరకడం లేదు. సమయభావం కారణంగా అడపాదడపా నియోజవర్గానికి వచ్చి వెళ్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక మొదటిసారి మూడు రోజులు నియోజవర్గంలో పర్యటించారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత నాలుగు సార్లు నియోజకవర్గానికి వచ్చినా.. సమయం కేటాయించింది కొద్దిగంటలు మాత్రమే. గతంలో ఓసారి కాకినాడకు వచ్చినా పిఠాపురం రాకుండానే వెళ్లిపోయారు. అయితే డిప్యూటీ సీఎంగా ఉండటంతో తాను నిరంతరం బిజీగా ఉంటాను. ప్రజలకు అందుబాటులో లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని గొల్లప్రోలు బహిరంగ సభలో ప్రజలకు హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్.
ఇక పవన్ కల్యాణ్ పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాస భవనం తీసుకున్నారు. ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు తన నాలుగంతస్తుల భవనాన్ని నెలకు రూపాయి అద్దెకు పవన్‌పై అభిమానంతో ఇచ్చేశారు. ఇక్కడికి కూడా పవన్ రెండు మూడు సార్లకు మించిరాలేదు. అయితే ఇక్కడ పరిస్థితులు తెలుసుకుని ప్రజలతో మాట్లాడేందుకు, వాటి పరిష్కారానికి తనకు సూచించేందుకు, అధికారులతో మాట్లాడేందుకు మర్రెడ్డి శ్రీనివాసరావు అనే నాయకుడిని నియమించారు. ఆయన ఇప్పుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని పిఠాపురం జనసైనికులతో పాటు తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి పిఠాపురానికి పవన్ కల్యాణ్ రెగ్యులర్‌గా రాలేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతం జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం తన నియోజకవర్గ కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా నియమించుకున్నారు. అయితే ఇంచార్జ్‌గా నియమితుడైన మర్రెడ్డి శ్రీనివాస్ స్థానికేతరుడు. ఆయనకు ఇక్కడ పరిస్థితులు తెలియవని జనసైనికులు చెబుతున్నారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన వారు. గతంలో జనసేన ఇంచార్జ్‌గా ఆ నియోజకవర్గానికి వ్యవహరించారు. ఇతర జిల్లాకు చెందిన నేతను పిఠాపురంలో ఎందుకు నియమించారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే మర్రెడ్డి శ్రీనివాసరావు మెగా బ్రదర్ నాగబాబుకు సన్నిహితుడని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు మర్రెడ్డి శ్రీనివాసరావుకు, టీడీపీ పిఠాపురం ఇంచార్జి వర్మకు మధ్య పొసగడం లేదు. ఇరువురు కలిసి ఏ కార్యక్రమానికి వెళ్లినా వివాదం జరుగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ తరపున కాకుండా ప్రభుత్వ పరంగా అధికార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ను నియమించారు.
ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. దీంతో నియోజకవర్గ బాధ్యతలు అన్ని మర్రెడ్డి చూస్తున్నారు. అయితే మర్రెడ్డి శ్రీనివాస్ రావు తమను కలవడం లేదని, ఏదైనా సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని పిఠాపురం ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ కార్యక్రమాలన్నిటికీ ఆయనే హాజరవుతున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ మొదలు ప్రతి అధికారి ఆయననే సంప్రదిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమను మర్రెడ్డి పట్టించుకోవడం లేదు అన్నది జనసైనికులు, వీర మహిళల ఆవేదన. పచ్చ చొక్కాల నాయకులు అయితే ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ మర్రెడ్డి శ్రీనివాసరావు అధికార కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అధికారులతో సమావేశాలే నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేకు మించి ఆయన అధికారులతో మమేకమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కూడా మర్రెడ్డి ఆదేశాల మేరకు తాము పని చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇటీవల దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయంలో కోడ్ సైతం పక్కన పెట్టి ఆయన సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. పిఠాపురంలో పవన్‌ను మించిన స్థాయిలో మర్రెడ్డి వ్యవహరిస్తున్నారని జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. ఏదైనా స్థానిక సమస్యపై ఆయన వద్దకు వెళితే పట్టించుకోవడం లేదన్నది జనసైనికుల ప్రధాన ఆరోపణగా ఉంది. ఇక పిఠాపురం నియోజవర్గానికి చెందిన ఐదుగురు సభ్యులతో ఫైవ్ మెన్ కమిటీని పవన్ వేస్తారని ప్రచారం జరిగినా ఇప్పటివరకు అమలు కాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టి సారించి శ్రీనివాసరావుతో క్యాడర్‌ను సమావేశపరిచి సమన్వయం చేయకపోతే ఇబ్బందులు తప్పవని నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
మొత్తంమీద జనసేన పార్టీ కోసం సొంత నిధులు ఖర్చు చేసి పనిచేస్తున్న కడారి తమ్మయ్య నాయుడు, డాక్టర్ పిల్లా శ్రీధర్ వంటి నేతలు సైతం సైలెంట్ అయ్యారు. కానీ మర్రెడ్డి శ్రీనివాస్ రావు మాత్రం తన స్పీడ్‌ను రెట్టించిన స్థాయిలో కంటిన్యూ చేస్తున్నారు. దాంతో భవిష్యత్తులో పవన్‌కు ఇబ్బందులు రావొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మర్రెడ్డి కంట్రోల్ చేయాలని జన సైనికులు కోరుతున్నారు. ఏదీఏమైనా తన ఇలాకాలో జరుగుతున్న పరిస్థితిపై పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎలా స్పందిస్తారనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది..