Komatireddy Brothers: అన్న ఆరాటం-తమ్ముడి పోరాటం.. ఆగమాగంలో 'కోమటిరెడ్డి బ్రదర్స్'

Komatireddy Brothers Two Ways In Politics What Happened: వాళ్లిద్దరూ అన్నదమ్ములు..! అన్న మంత్రిగా అధికారం చెలాయిస్తుంటే.. తమ్ముడు మాత్రం మంత్రి పదవి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు..! తమ్ముడి తీరు ఇలా ఉంటే.. అన్న మాత్రం తమ ప్రభుత్వం ఆహా ఓహో అంటున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇద్దరు భిన్న వాదనలు ఎందుకు వినిపిస్తున్నారు?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 8, 2025, 07:14 PM IST
Komatireddy Brothers: అన్న ఆరాటం-తమ్ముడి పోరాటం.. ఆగమాగంలో 'కోమటిరెడ్డి బ్రదర్స్'

Komatireddy Brothers Two Ways: నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గెలిస్తే.. మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వెంకట్‌ రెడ్డిని మంత్రి పదవి వరించింది. కానీ రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యే పదవికే పరిమితం అయ్యారు. అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చే సమయంలో రాజ్‌గోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఓ హామీ ఇచ్చిందట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని భరోసా కల్పించారట. కానీ ఏడాది గడిచినా.. రాజ్‌గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయనలో అసహనం పెరిగిపోతుందట. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మంత్రి పదవి ఇస్తారని సొంత పార్టీ లీడర్లను ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

Also Read: KT Rama Rao: 'సూర్యుడి మాదిరి మబ్బుల చాటుకు వెళ్లిన కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు'

ఇక కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి పదవి దక్కేలా లేదని తెలుసుకున్న రాజ్‌గోపాల్‌ రెడ్డి.. కొద్దిరోజులుగా సొంత పార్టీ నేతలనే ఇప్పుడు టార్గెట్‌ చేశారు. తాజాగా సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన.. మరోసారి సొంత పార్టీ నేతలకే చురకలంటించారు. ఇటీవల రేవంత్ సర్కార్‌ అమలు చేసిన రైతు రుణమాపీ అనుకున్న స్థాయిలో జరగలేదని ఆరోపించారు. రుణమాఫీ సరిగ్గా అమలు చేయకపోవడంతో గ్రామాల్లో తిరిగే పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. గతంలోనూ రేవంత్ రెడ్డి పనితీరుపై రాజ్‌గోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. అయితే అధికార పార్టీలో కొనసాగుతూ.. సొంత పార్టీ లీడర్లను రాజ్‌గోపాల్ రెడ్డి ఎందుకు టార్గెట్‌ చేశారని గాంధీభవన్‌ వర్గాలు ఆరా తీశాయట. అయితే రాజ్‌గోపాల్ రెడ్డిలో ఆ స్థాయిలో ఆగ్రహజ్వాలలు పెల్లుభికడం వెనుక మంత్ర పదవి దక్కలేదనే అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతోంది.

Also Read: KTR Reaction: ఢిల్లీ ఎన్నికలపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు.. దాడికి దిగిన కాంగ్రెస్‌ శ్రేణులు

ఇక తమ్ముడి వెర్షన్‌ ఇలా ఉంటే.. అన్న కోమటి రెడ్డి వెర్షన్‌ మరోలా ఉంది.. ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఊహించని విజయాలు సాధించినట్టు ప్రకటించారు. దేశంలోనే మొట్ట మొదటి సారి కుల గణన చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. అంతేకాదు రానున్న 30 ఏళ్లు పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఢంకా భజాయించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ 100 శాతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అన్నకు పూర్తి విరుద్దంగా అన్న మాట్లాడుతుండటంతో నల్గొండ జిల్లా కేడర్‌ మాత్రం పరేషన్ అవుతున్నట్టు తెలిసింది.

మంత్రి పదవిపై సందిగ్ధం
ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో అన్ని జిల్లాల్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా నేతలకు పదవులు దక్కాయి. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలకే పదవులు వరించాయి. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇద్దరూ కూడా సీనియర్‌ నేతలు కావడంతో మంత్రి పదవులు దక్కాయి. దాంతో మరో సామాజికవర్గానికి పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైందని పార్టీ నేతలు అంటున్నారు.

రాజ్‌గోపాల్‌ రెడ్డి తిరుగుబాటు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో సర్కార్‌ ఏర్పడగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఇదే విషయాన్ని రాజ్‌గోపాల్‌ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి విషయంలో రాజ్‌గోపాల్‌కు హామీ దొరకడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయనలో అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

పదవి లేకుంటే రాజీనామా?
మొత్తంగా మంత్రి పదవి దక్కదన్న నిరాశతోనే రాజ్‌గోపాల్‌రెడ్డిలో సహనం నశిస్తోందని అనుచరులు చెబుతున్నారు. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని అంటున్నారు. అన్నకు మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి.. పార్టీ కోసం కష్టపడిన రాజ్‌గోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఏదీఏమైనా తమ నేతకు మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్‌లో కొనసాగుతామని చెబుతున్నారు.. పదవి దక్కకపోతే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మొత్తంగా మంత్రి రాలేదని రాజ్‌గోపాల్‌ లో అసంతృప్తి తాండవిస్తుంటే.. అన్న వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ సర్కార్‌కు ఎదురులేదని చెబుతుండటంతో నల్గొండ జిల్లా ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పరేషాన్‌ అవుతున్నట్టు తెలిసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News