Congress Vs BJP: దేశంలో కాంగ్రెస్- బీజేపీ పార్టీలను ఉత్తర దక్షిణ ధ్రువాలుగా చెబుతారు. చాలా రాష్ట్రాల్లో ఒక పార్టీ కాకి మరో పార్టీ ఆఫీసుపై వాలదు. అలాంటింది ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి కోసం రెండు పార్టీలను పక్కన పెట్టేశారని టాక్ వినిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో నేతలంతా పార్టీలను పక్కన పేట్టేసి కేవలం అభివృద్ధి అనే మాట మాట్లాడుతుండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందువరకు జిల్లాలో నువ్వానేనా అన్నట్టు తలపడినా కాంగ్రెస్- బీజేపీ పార్టీల నేతలు ఎన్నికలు అయిపోగానే ఇలా కలిసిపోయారేంటి అని జిల్లా ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారట.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కాషాయ జెండాను రెపరెపలాడించారు ఆమె.. డీకే అరుణ విజయంతో బీజేపీకి జిల్లాలో కొత్త జోష్ వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత.. కొద్దిరోజులుగా రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమనే పరిస్థితి.. కానీ ఇటీవల మహబూబ్ నగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని అన్నిచోట్ల కమలం పార్టీ ఎంపీతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసిపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ డీకే అరుణకు అక్కడి కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడ తిరుపతి రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డీకే ఆరుణ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఆ తర్వాత మక్తల్ నియోజకవర్గంలో పర్యటించారు ఎంపీ డీకే అరుణ, నారాయణపేటలో పలు అభివృద్ధి పనులకు తన మేనకోడలు నారాయణపేట ఎమ్మెల్యేతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం నారాయణ పేట మున్సిపాలిటీలో తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద అందజేస్తున్న నిధులను మున్సిపాలిటీల్లో ఖర్చు చేయాలన్నారు ఎంపీ డీకే అరుణ. త్వరలోనే నారాయణ పేటకు సైనిక్ స్కూల్‌ను తీసుకువస్తామని చెప్పారు. అయితే ఎంపీ- ఎమ్మెల్యే కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో రెండు పార్టీల కేడర్ ఖుషీ అవుతున్నారు.
ఆ తర్వాత మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకువచ్చారు ఎంపీ డీకే అరుణ. పాలమూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ నిధులు తరలిస్తున్నారు. ఇటీవల పాలమూరు యూనివర్సిటీకి ప్రత్యేకంగా కేంద్ర నిధులు వచ్చేలా చేశారట. అంతేకాదు మహబూబ్ నగర్‌లో అనేక అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. అయితే గతంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో డీకే ఆరుణతో ఎమ్మెల్యేకు మంచి అనుబంధం ఉంది. ఆ చనువుతోనే డీకే అరుణను పాలమూరుకు తీసుకువచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా పాలమూరు లీడర్లు రాజకీయాల్ని పక్కన పెట్టేసి కేవలం అభివృద్ధి కోసం కలిసిపోవడాన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు. ఇకమీదట కూడా నేతలంతా కలిసిపోయి.. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతున్నారు. ఏదీఏమైనా మహబూబ్ నగర్ లీడర్ల తీరుపై మాత్రం హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: EPFO Updates: పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!
Also Read: Sai Pallavi: అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం.. మనసులోని మాట బైటపెట్టిన సాయి పల్లవి.. మ్యాటర్ ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter