Telangana Politics: ఈ జిల్లాలో కమలం నేతలు కస్సుబుస్సు.. కయ్యానికి సై అంటూ..!

Telangana BJP: ఆ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి చిచ్చురేపిందా..! అసలే అంతంత మాత్రంగా ఉన్న క్యాడర్‌ జిల్లా అధ్యక్ష పదవిని ప్రకటించడంతో వర్గాలుగా విడిపోయారా..! నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పార్టీ సిద్ధాంతాలు తెలియని వ్యక్తికి పగ్గాలు అప్పజెప్పితే మేం పార్టీలో పనిచేయలేమంటూ ఏకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారా..! 30 ఏళ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఆ వ్యక్తికే మళ్లీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారా..! ఇప్పటికే సంవత్సర కాలం అధ్యక్షుడిగా పనిచేసిన అ నేత తీరు పార్టీకే నష్టం కలిగించిందంటూ రాష్ట్ర నాయకత్వానికి విన్నవించినా పార్టీ నియమ నిబంధనలు కాదని జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందా..!   

Written by - G Shekhar | Last Updated : Feb 7, 2025, 06:32 PM IST
Telangana Politics: ఈ జిల్లాలో కమలం నేతలు కస్సుబుస్సు.. కయ్యానికి సై అంటూ..!

Telangana BJP: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాషాయ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. అయినప్పటికీ నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరి మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ప్రభావాన్ని చూపించింది. అప్పట్లో మున్సిపల్ చైర్మన్ పదవులు కూడా గెలుచుకోగలిగింది. కానీ ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనీసం నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా పలుకుబడి క్యాడర్ ఉన్న నాయకున్ని నిలిపే పరిస్థితిలో కూడా లేదనేది ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి.. ఇలాంటి సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అనుభవమున్న, పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తికి ఇచ్చి పార్టీని చక్కబెట్టుకునే విధంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎందుకు పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి అనుభవం లేని వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పజెప్పుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో ఆ పార్టీలో చిచ్చురేగింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారిని కాదని, కనీస వయసు, అర్హత కూడా లేని వ్యక్తికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పజెప్పడంపై కమలం నేతలు గుర్రుమంటున్నారు. ఇప్పటికే ఏడాది కాలంగా వర్గాలుగా విడిపోయి ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు అధ్యక్ష పదవి ప్రకటించడంతో పార్టీని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఇక నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దోనూరి వీరారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి పోటీ పడ్డారు. ఇక బీసీ సామాజికవర్గం నుంచి మదగోని శ్రీనివాస్ గౌడ్, కనగంచి రమేష్ బరిలో నిలిచారు. అటు ఎస్సీ సామాజికవర్గం నుంచి పూతపాక సాంబయ్యలు పోటీపడ్డారు. ఇందులో కమలం పార్టీలో అత్యంత జూనియర్, వయసు రీత్యా కూడా జిల్లా అధ్యక్షుడికి ఉండాల్సిన వయసు కూడా లేని వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి బీజేపీలో జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలంటే కనీస వయసు 45 ఏళ్లు దాటి ఉండాలి. 

కానీ నల్గొండ జిల్లాకు అధ్యక్షుడిగా ఎంపిక చేసిన నాగం వర్షిత్ రెడ్డికి కనీసం 35 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నట్లు ఆ నేతలు పేర్కొంటున్నారు. పార్టీ సిద్ధాంతం ప్రకారం 45 ఏళ్ల పైబడిన నేతకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనేది, అలాగే క్రియాశీల సభ్యత్వం ఉన్న నాయకుడినే అధ్యక్షుడిగా ఎంపిక చేయాల్సి ఉంటుందట. కానీ నాగం వర్షిత్ రెడ్డి విషయంలో ఎందుకు పార్టీ సిద్ధాంతాలు పక్కకు పెట్టారు అని నేతలు ప్రశ్నిస్తున్నారట. దీనికి తోడు ఇదే సూర్యాపేట జిల్లా అధ్యక్ష పదవికి పోటీపడిన సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వరరావు కుమారుడు సంకినేని వరుణ్ కు మాత్రం జిల్లా అధ్యక్ష పదవికి వయసు సరిపోవటం లేదని తిరస్కరించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే నాగం వర్షిత్ రెడ్డి కంటే వరుణ్ మూడేళ్లు వయసులో పెద్దవాడు అక్కడ వయసు రిమార్కు చూపి రిజెక్ట్ చేసిన అధిష్టానం పెద్దలు.. నల్గొండలో మాత్రం ఈ రూల్‌ ఎందుకు పాటించలేదని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు.
 
మరోవైపు నాగం వర్శిత్ రెడ్డి బిజెపి పార్టీలో చేరి కనీసం ఐదు సంవత్సరాలు కూడా కాలేదు. కానీ ఆయనను రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది ఎన్నికల సీజన్ కావడంతో పార్టీ సంస్థ గత పదవులను వాయిదా వేసిన హైకమాండ్‌.. ఆ తర్వాత బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర  పార్టీ నియమించింది. అయితే ఆ సమయంలోనే వర్షిత్ ను జిల్లాలోని కొంత మంది నాయకులు వ్యతిరేకించారు. నిన్న మొన్ననే వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ సీనియర్లంతా వ్యతిరేకించారు. కానీ పార్టీ నిర్ణయం కాబట్టి చేసేది లేక వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత మంది నేతలు దూరంగా ఉన్నారు. అయితే ఆ ఏడాదిలో ఎంపీ, MLC ఎన్నికలు వచ్చాయి. 

ఆ ఎన్నికల కోసం పార్టీ ఫండ్ వచ్చిందని, బూత్ లెవల్ లో ఖర్చులకు ఇవ్వాల్సిన డబ్బులను అధ్యక్షుడు వర్షిత్ 60 లక్షల వరకు నొక్కేశాడని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆరు నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి అధ్యక్షులకు నాగం వర్షిత్ రెడ్డికి ఘర్షణలు జరిగాయనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. దీనికి తోడు తనును ప్రశ్నించిన వారిపై అధ్యక్షుడి హోదాలో నాగం వర్షిత్ రెడ్డి మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను చెప్పినట్టే అందరు వినాలని ఆదేశాలు జారీ చేశారట. ఈ తతంగంపై పలుమార్లు రాష్ట్ర నాయకత్వానికి కొంతమంది నేతలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. 
 
వాస్తవానికి కేవలం ఏడాదిపాటు అధ్యక్షుడిగా కొనసాగిన నాగం వర్శిత్ రెడ్డి పార్టీ సిద్ధాంతాలు కూడా తెలియవని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఎవరైనా నాయకులు, కార్యకర్తలు గాని ప్రశ్నిస్తే వారిని స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ రానియ్యనని బెదిరింపులకు దిగేవాడని చెబుతున్నారు. అంతే కాక పార్టీలో ఉన్న సీనియర్ల ను కూడా గౌరవించలేదని విమర్శలు వున్నాయి. ఇప్పటికే ఈ అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌కు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఫిర్యాదు చేశారట. అయితే ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి మరోసారి ఇవ్వొదని ఫిర్యాదు చేసిన మళ్లీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి మొదలైందట. 

పార్టీ సిద్ధాంతాల ప్రకారం అధ్యక్ష పదవి కోసం ఇతర పేర్లను పరిశీలించకుండా కొంత మంది స్వార్థం కోసం అనుభవం లేని వ్యక్తినే అధ్యక్షుడిగా ఎంపిక చేశారని నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాక జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం పునరాలోచించాలని లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన నాగం వర్షిత్ రెడ్డిని మార్చకుంటే పార్టీ ఆఫీసు మెట్లు కూడా ఎక్కేది లేదంటూ అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు వార్నింగ్‌ ఇవ్వడం సంచలనంగా మారింది. 
 
మొత్తంమీద నల్గొండ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్ష ఎంపికపై పునరాలోచించాలని పలువురు బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఎంపికపై పార్టీ పునరాలోచిస్తుందా లేక ఆయననే కొనసాగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నాగ వర్షిత్‌ రెడ్డిని తప్పించకపోతే మాత్రం జిల్లాలో నేతలంతా ముకుమ్మడిగా రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.. 

Trending News