Telangana politics : తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనట్లుగా బీసీల మధ్య చైతన్యం కనపడుతుంది. తెలంగాణ సర్కార్ చేట్టిన కులగణన తెలంగాణలోని బీసీలను ఒక్కతాటిపైకి వచ్చేలా చేసింది. రేవంత్ సర్కార్ మంచి ఉద్దేశంతోనే కులగణన చేపట్టినా ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్ కు పెద్ద సమస్యగా మారింది. క్యాస్ట్ సెన్సస్ చేస్తే రాజకీయంగా తెలంగాణలో తిరుగుండదు అని రేవంత్ రెడ్డి భావించారు కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ను సుడిగుండంలోకి నెట్టేసేలా మారింది. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దానిని సూచిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని పెద్ద ఎత్తున బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అంతే కాదు అధికార పార్టీలోనే ఈ కులగణన పెద్ద చిచ్చును రేపుతుంది.
రూలింగ్ పార్టీకీ చెందిన ఒక ఎమ్మెల్సీ కులగణన తప్పుల తడక అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అంతే కాదు ఈ కులగణన రిపోర్టును కాల్చివేయండి అంటూ ప్రకటన చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ అధికార పార్టీలో కలకలం సృష్టించాయి. పైకి తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ను తప్పుపట్టినా మెజార్టీ బీసీ నేతల్లో అదే ఫీలింగ్ ఉందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కులగణనలో రాష్ట్రంలో బీసీల జనాభాను తక్కువగా చూపారంటూ బీసీ నేతలు మండిపడుతున్నారు. అంతే కాదు ఐనా సమాజంలో సుమారు 60శాతం ఉన్న తమపై కొన్ని అగ్రకులాలు పెత్తనం చేయడం ఏంటని ప్రశ్నించడం మొదలు పెట్టాయి. అంతే కాదు ఇక నుంచి రాజకీయంగా కూడా మేము ముందు వరుసలో ఉంటామ. భవిష్యత్తులో ఇక రాష్ట్రాన్ని ఏలేది బీసీ నాయకుడే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయ పార్టీల్లో కలవరం మొదలైంది.
ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక రెడ్డిల్లో తానే చివరి సీఎం అని ప్రకటించే వరకు వెళ్లింది. దీనికి కారణం కూడా బీసీ నినాదం ఎఫెక్టే అనేది అందరూ అనుకుంటున్నారు.బీసీల నుంచి వస్తున్న డిమాండ్ల పట్ల ప్రభత్వం కూడా అప్రమత్తమైంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లదని రేవంత్ సర్కార్ గ్రహించి దిద్దుబాటు చర్యలకు దిగింది. దానిలో భాగమే కులగణన రీ సర్వే ఒకటి కాగా , మరొక అంశం బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశాలను సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.ఐతే కులగణనతోనే రాజకీయంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో అని పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు ఈ విషయం సద్దుమణిగినా భవిష్యత్తులోమాత్రం కాంగ్రెస్ ఈ బీసీ ఉద్యమాన్ని ఎలా డీల్ చేస్తుందో మాత్రం వేచి చూడాలని చాలా మంది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక బీజేపీలోను బీసీ మంటలు మొదలయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీ బీసీ నినాదం ఎత్తుకున్న పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో బీసీ జపం చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు. దీనికి ఓ కారణం లేకపోలేదు. బీజేపీ పైకి బీసీ జపం చేస్తున్నా లోలోన మాత్రం అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తుందనేది కమలం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తొలగించి రెడ్డి వర్గానికి చెందిన కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం పట్ల బీసీలు రగిలిపోయారట. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్లుగా ఫలితాలు రాలేదని అంటున్నారు.
అంతే కాదు తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అసలు బీసీలను బీజేపీలో ఉండనిస్తారా ఉండనివ్వరా అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. పార్టీ అధ్యక్షుడు రెడ్డి, ఫ్లోర్ లీడర్ రెడ్డి మరి బీసీల పరిస్థితి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ఎమ్మెల్యేలపై ఎందుకు ఇంత దౌర్జన్యం అని మండిపడ్డారు. రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బీసీ నేతనే నియమిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా కూడా అది ఇంతవరకూ అతీగతీ లేదని బీసీ నేతలు సీరియస్ గా ఉన్నారు. అంతే కాదు జిల్లా అధ్యక్షుల నియామకంలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తుంది.
ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీలో ఇప్పుడు బీసీ నినాదం పెద్ద రాజకీయ రచ్చకు దారి తీస్తుంది. సున్నితమైన ఈ అంశంలో పార్టీల వైఖరి ఎలా ఉండబోతుందో అని సర్వత్రా ఆసక్తిగా మారింది. బీసీ అంశాన్ని ఏమాత్రం సరిగ్గా డీల్ చేయకపోయినా దాని పర్యవసనాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని ఈ రెండు పార్టీల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇలా ఇప్పుడు రాష్ట్రంలో బీసీల అంశం రెండు జాతీయ పార్టీలను కలవరపరుస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అని పార్టీలు తెగ ఆందోళన చెందుతున్నాయి.
Also read: Telangana DSC: డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, 1382 మంది ఎస్జీటీలుగా నియామకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి